అప్పుడు బ్లాంక్ అయిపోయా.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమ్ ఇండియా 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Update: 2024-07-16 14:14 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రసవత్తరంగా సాగిన ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజాగా ఫైనల్ మ్యాచ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి ఐదు ఓవర్లలో తాను బ్లాంక్ అయిపోయానని చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్నాడు.

డల్లాస్‌లో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్.. ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడాడు. ‘సౌతాఫ్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. అప్పుడు నేను బ్లాంక్ అయిపోయాను. అయితే, నేను ఎక్కువ దూరం ఆలోచించను. ప్రస్తుత క్షణంలోనే ఉండాలనుకుంటా. ఆ సమయంలో నేను తాను ఏం చేయాలనే దానిపైనే ఫోకస్ పెట్టా. ప్రశాంతంగా ఉండి, మా ప్లాన్స్‌ను అమలు చేయడం మాకు చాలా ముఖ్యం. ఆ ఒత్తిడిలో మేము ఐదు ఓవర్లు వేసిన తీరు మా ప్రశాంతతను తెలియజేస్తుంది. మేము మా పనిపైనే దృష్టి పెట్టాం. దేని గురించి ఆలోచించలేదు. ఆ సమయంలో మేము భయపడకపోవడమే మాకు కలిసొచ్చింది.’ అని తెలిపాడు.

కాగా, ఫైనల్‌లో ఒక దశలో భారత్ ఓటమి అంచున నిలిచింది. దక్షిణాఫ్రికా 30 బంతుల్లో 30 పరుగులే చేయాల్సి ఉండటం, క్లాసెన్ దూకుడుగా ఆడుతుండటంతో మ్యాచ్ సఫారీలదే అనిపించింది. కానీ, చివరి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. బుమ్రా, అర్ష్‌దీప్, పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం వరించిన విషయం తెలిసిందే. 


Similar News