అందుకే ఆ స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం: Rohit Sharma

Update: 2023-09-24 13:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో రెస్ట్ తీసుకుంటున్న రోహిత్ శర్మ.. ఈ విశ్రాంతి సమయాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ తన ఫేవరేట్ మైదానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ భారత మైదానాల్లో నా ఫేవరేట్ గ్రౌండ్. ఈ స్టేడియంలోనే నేను టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాను. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్నాను. అంతేకుండా వన్డేల్లో అత్యధిక స్కోర్ 264 పరుగులను ఇదే స్టేడియంలో చేశాను. ఇక్కడే ఐపీఎల్‌లో సెంచరీ కూడా నమోదు చేశాను. రంజీ ట్రోఫీలో ఈ స్టేడియంలోనే డబుల్ సెంచరీ అందుకున్నాను. నా తొలి ఐపీఎల్ ట్రోఫీని కూడా ఇక్కడే తీసుకున్నాను. అందుకే ఈ స్టేడియమంటే నాకు చాలా ఇష్టం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

2013లో కోల్‌కతా వేదికగా టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. 2014లో 264 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌ సౌతాఫ్రికా దిగ్గజం డేయిల్ స్టెయిన్ అని రోహిత్ శర్మ తెలిపాడు. అతని పనితీరు, క్రమశిక్షణ ఆకట్టుకుంటుందని చెప్పిన రోహిత్.. కొత్త బంతితో వేసే బంతులను ఆడటం సవాల్‌తో కూడుకున్నదన్నాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. మూడో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతని గైర్హాజరీలో కేఎల్ రాహుల్ టీమిండియాను లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆసీస్‌తోనే అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14న అహ్మదబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Tags:    

Similar News