ఆ మ్యాచ్ ఆధారంగా టీమ్ కాంబినేషన్‌‌ను నిర్ణయిస్తాం : Rohit Sharma

Update: 2023-09-01 15:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్న హై ఓల్టేజ్ సమరానికి రంగం సిద్దమైంది. మరో 20 గంటల్లో ఆసక్తికర సమరానికి తెరలేవనుంది. ఆసియాకప్ 2023లో భాగంగా శనివారం దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్‌ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే పాక్‌తో బరిలోకి దిగబోయే టీమిండియా కాంబినేషన్‌పై స్పందించాడు. ఆసియాకప్ తమ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు పరీక్ష కాదని స్పష్టం చేశాడు. ఈ టోర్నీ కోసం తమ జట్టు అద్భుతంగా ప్రిపేర్ అయ్యిందని.. ప్రాక్టీస్ క్యాంప్‌లోనే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించామని తెలిపాడు. రేపటి మ్యాచ్ కోసం తమ మైండ్‌లో చాలా కాంబినేషన్స్ ఉన్నాయని.. కాండీ వేదికగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని టీమ్ కాంబినేషన్‌ను ఎంపిక చేస్తామన్నాడు.

'మాకు చాలా కాంబినేషన్స్ అందుబాటులో ఉన్నాయి. గురువారం జరిగిన మ్యాచ్ ఆధారంగా టీమ్ కాంబినేషన్‌‌ను నిర్ణయిస్తాం. మా బ్యాటింగ్ లైనప్‌లో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. ఆసియాకప్ చాలా పెద్ద టోర్నీ.. ఎంతో చరిత్ర ఉంది. ఈ టోర్నీ మాకు ఫిట్‌నెస్ టెస్ట్‌లా కాదు. గత వారం జరిగిన ప్రాక్టీస్ క్యాంప్‌లోనే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించాం. జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. అతని రాక మా జట్టుకు శుభ సూచకం. ఈ ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ ఆడుతాయని ఆశిస్తున్నా.

జట్టు తరఫున మెరుగ్గా ఆడటం.. మెరుగైన స్థితిలో నిలపడమే నా బాధ్యత. నేనెప్పుడూ జట్టు విజయం కోసం ఆడుతాను. గత కొన్నేళ్లుగా నేను హై రిస్క్ అప్రోచ్‌తో బ్యాటింగ్ చేశాను. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కూడా నాకు తెలుసు. ఏది ఏమైనా నా జట్టును మంచి స్థితిలో నిలపడమే నా పని. వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. టీ20ల్లో ఇది అవసరం లేకపోయినా.. వన్డేల్లో మాత్రం తప్పనిసరి. మా అనుభవాన్ని ఉపయోగించి పాక్ బౌలర్లను ఎదుర్కొంటాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


Similar News