టీపీఎల్ ఆడబోతున్న బోపన్న.. 6వ సీజన్‌కు అందుబాటులోకి
భారత టెన్నిస్ ప్లేయర్, పురుషుల డబుల్స్ మాజీ వరల్డ్ నం.1 రోహన్ బోపన్న టెన్నిస్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)లో అరంగేట్రం చేయనున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ ప్లేయర్, పురుషుల డబుల్స్ మాజీ వరల్డ్ నం.1 రోహన్ బోపన్న టెన్నిస్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)లో అరంగేట్రం చేయనున్నాడు. ముంబై వేదికగా డిసెంబర్‌లో జరగబోయే 6వ సీజన్‌లో అతను ఆడబోతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ నం.6 ర్యాంకర్ అయిన బోపన్న ఎంట్రీతో టీపీఎల్ క్రేజ్ మరింత పెరగనుంది. 2018లో ప్రారంభమైన టీపీఎల్ ఇప్పటివరకు ఐదు సీజన్లను విజయవంతంగా ముగించుకుని 6వ సీజన్‌కు సిద్ధమవుతోంది. టీపీఎల్‌లో ఆడటం కోసం ఎదురుచూస్తున్నానని బోపన్న తెలిపాడు. ‘వినూత్నమైన 25 పాయింట్ ఫార్మాట్ అయిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ ఏడాదిని పూర్తి చేయడానికి ఈ టోర్నీ సరైంది. ప్రతిభను వెలికితీసే టీపీఎల్ లాంటి టోర్నీలు యువ ప్లేయర్లకు స్ఫూర్తినిస్తాయి.’ అని తెలిపాడు. టోర్నీలో భారత ఆటగాడు సుమిత్, ఫ్రాన్స్‌కు చెందిన హ్యుగో గాస్టన్, అర్మేనియా ప్లేయర్ ఎలినా అవనేస్యన్‌లతో బోపన్న పోటీపడనున్నాడు.