44 ఏళ్ల వయసులో అదరగొడుతున్న బోపన్న.. యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌కు
నాలుగు పదుల వయసులోనూ రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : నాలుగు పదుల వయసులోనూ రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఈ భారత సీనియర్ టెన్నిస్ ఆటగాడు యూఎస్ ఓపెన్ టైటిల్‌పై కన్నేశాడు. పురుషుల డబుల్స్‌లో ప్రీక్వార్టర్స్‌లో ఓడినా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. టైటిల్ దిశగా దూసుకెళ్తున్న బోపన్న ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్‌లో బోపన్న, అల్దిలా సుత్జియాడి(ఇండోనేషియా) జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న జోడీ 4వ సీడ్ క్రెజికోవా(చెక్ రిపబ్లిక్)-మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) ద్వయానికి షాకిచ్చింది.
గంటన్నరకు పైగా ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 7-6(7-4), 6-2, 10-7 తేడాతో గెలుపొందింది. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్న బోపన్న జోడీ తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో నెగ్గింది. రెండో సెట్‌ను క్రెజికోవా-ఎబ్డెన్ జంట గెలుచుకోవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక టై బ్రేకర్‌కు వెళ్లింది. అక్కడ కూడా తీవ్ర పోటీని తట్టుకుని నిలబడ్డ బోపన్న జోడీ టై బ్రేకర్‌లో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. 6 ఏస్‌లు, 27 విన్నర్లతో బోపన్న జంట దూకుడుగా ఆడగా.. క్రెజికోవా-ఎబ్జెన్ ద్వయం 5 డబుల్ ఫౌల్ట్స్, 26 తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. సెమీస్‌లో అమెరికాకు చెందిన డొనాల్డ్ యంగ్-టేలర్ టౌన్సెండ్ జంటను బోపన్న, అల్దిలా సుత్జియాడి ఎదుర్కోనున్నారు. 2015 తర్వాత యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.