Rishabh Pant accident:కొంపముంచిన సర్ ప్రైజ్! రిషబ్ కారు ప్రమాదానికి కారణమిదే!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటన్న దానిపై అధికారులు స్పందించారు. రిషబ్ పంత్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అని ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడించారు. రిషబ్ పంత్ కారు ప్రమాదంపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పందిస్తూ ప్రమాద సమయంలో పంత్ నిద్రపోతూ డ్రైవింగ్ చేయడంతో కారుపై నియంత్రణ కోల్పోయినట్టు తెలిపారు. దీంతో కారు రోడ్డు పక్కన రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. ఈ సమయంలో పంత్ చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. కారులో మంటలు చెలరేగడంతో కారు అద్దాలు పగులకొట్టుకుని పంత్ బయటకు దూకి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే ఆ సమయంలో కారు అద్దాలు బ్రేక్ కాకపోయి అందులోనే చిక్కుకుని ఉన్నా, ఘటనలో మరి కాస్త గాయాల పాలైనా ఊహించని విషాదమే మిగిలేదని తెలుస్తోంది.
కొంప ముంచిన సర్ ప్రైజ్ ప్లాన్
కాగా శ్రీలంకతో జరగబోయే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో పంత్‌కు చోటు దక్కలేదు. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు పంత్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలకు హాజరై తన తల్లికి సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పంత్ శుక్రవారం తెల్లవారుజాము బయలుదేరాడు. అతివేగంగా కారు నడిపిన పంత్ అంతలోనే నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిషబ్ పంత్‌కు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.