కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్.. వారిద్దరిలో పగ్గాలు ఎవరికి దక్కాయంటే?
టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు చేపట్టాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు చేపట్టాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ మంగళవారం వెల్లడించింది. ‘రిషబ్‌ను మళ్లీ మా కెప్టెన్‌గా స్వాగతిస్తున్నాం. నూతన అభిరుచి, శక్తి, ఉత్సాహంతో అతను మరోసారి మా జట్టును నడిపించడాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నాను.’ అని ఫ్రాంచైజీ చైర్మన్ పార్త్ జిందాల్ తెలిపారు. ఫ్రాంచైజీ ఎక్స్ హ్యాండిల్ ‘వెల్‍కమ్ బ్యాక్ కెప్టెన్ రిషబ్ పంత్’ అంటూ పోస్ట్ చేసింది. అలాగే, ర్యూబిక్స్ క్యూబ్‍లతో పంత్ ముఖాన్ని తయారు చేసిన వీడియోను పోస్ట్ చేసింది. 2021లో తొలిసారిగా ఢిల్లీ పగ్గాలు చేపట్టిన పంత్.. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో గతేడాది సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే. గత సీజన్‌లో డేవిడ్ వార్నర్ జట్టును నడిపించాడు. దాదాపు 14 నెలల తర్వాత రిషబ్ పంత్ ఐపీఎల్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.ఈ సీజన్‌లో పంత్ కెప్టెన్‌గా ఉంటాడని జట్టు వర్గాలు మొదటి నుంచి తెలిపినా ఫ్రాంచైజీ తాజాగా అధికారికంగా స్పష్టతనిచ్చింది. గత సీజన్‌లో 9వ స్థానంలో నిలిచిన ఢిల్లీ.. ఈ సారి పంత్ కెప్టెన్సీలో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. ఈ నెల 23న పంజాబ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.