ఆ విషయంలో ధోనీలాగే స్టోక్స్ : Ricky Ponting

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌పై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు.

Update: 2023-07-05 16:26 GMT

లండన్ : ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌పై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. తాజా ఇంటర్వ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ.. మ్యాచ్‌ను ఫినిష్ చేయడంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో స్టోక్స్‌ను పోల్చాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరైనా ఒత్తిడిలో ఆడగలరు. కానీ స్టోక్స్‌లా మిడిలార్డర్ లేదా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు. ధోనీ చాలా టీ20 మ్యాచ్‌ల్లో చివరి వరకూ నిలిచి మ్యాచ్‌ను ముగించిన సందర్భాలు ఉన్నాయి. బెన్‌స్టోక్స్ టెస్టుల్లో అదే చేస్తున్నాడు. క్రికెట్‌లో ఇలా అందరూ చేయలేరు.’ అని తెలిపాడు.

2019 లీడ్స్ టెస్టులోనూ స్టోక్స్ ఒంటరి పోరాటం చేసి ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడని పాంటింగ్ గుర్తు చేశాడు. రెండో టెస్టులోనూ అదే ఆటతీరుతో జట్టును గెలిపించినంత పనిచేశాడని చెప్పాడు. ప్రస్తుత కెప్టెన్లతో పోలిస్తే స్టోక్స్ ఒత్తిడిని మెరుగ్గా హ్యాండిల్ చేస్తున్నాడని కితాబిచ్చాడు. కాగా, యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను గెలిపించడానికి కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఒంటరి పోరాటం చేసిన విషయం తెలిసిందే. 214 బంతుల్లో 155 పరుగులతో స్టోక్స్ పోరాడినా మరో ఎండ్‌లో బ్యాటర్లు నిరాశపర్చడంతో ఇంగ్లాండ్ వరుసగా రెండో టెస్టులోనూ పరాజయం పాలైంది.


Similar News