దిశ, స్పోర్ట్స్ : ఈజిప్ట్‌లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రిథమ్ సాంగ్వాన్, ఉజ్వల్ మాలిక్ జోడీ స్వర్ణ పతకం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో రిథమ్, ఉజ్వల్ జోడీ 17-7 తేడాతో అర్మేనియాకు చెందిన ఎల్మిరా కరాపెట్యాన్, బెనిక్ ఖల్‌ఘట్యాన్‌పై విజయం సాధించింది. దీంతో టోర్నీలో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. అలాగే, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సోనమ్ ఉత్తమ్, అర్జున్ జోడీ రజతం గెలుచుకుంది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత జోడీ 14-16 తేడాతో గ్రేట్ బ్రిటన్ ద్వయం చేతిలో పోరాడి ఓడి రెండో స్థానంతో సరిపెట్టింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో అనురాధ దేవి రజత పతకం సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 575 స్కోరుతో 8వ స్థానంలో నిలిచిన ఆమె.. ఫైనల్‌లో సత్తాచాటింది. 239.9 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి పతకం గెలుచుకుంది. దీంతో టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, రెండు రజత పతకాలతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్నది.