ఆసియా కప్ నిర్వహణలో ట్విస్ట్.. ఆడితే లంకలో ఆడండి.. పీసీబీకి షాకిచ్చిన ఏసీసీ..!
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ నిర్వహణ వివాదంలో మరో మలుపు. పాకిస్తాన్ లేకుండానే ఈ టోర్నీ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సిద్ధమవుతున్నది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ (భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికపై, ఇతర మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో) కు బీసీసీఐతో పాటు ఏసీసీ కూడా అంతగా అనుకూలంగా లేనట్టు సమాచారం. హైబ్రిడ్ మోడ్ ప్రకారం.. పాక్‌లో కొన్ని మ్యాచ్‌లు.. భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ భావించింది. కానీ హైబ్రిడ్ మోడ్‌కు బీసీసీఐ అంగీకరించలేదని.. ఆ సమయంలో దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుందని.. ఆటగాళ్లు తట్టుకోలేరని ఏసీసీకి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. ఏసీసీలో భాగంగా ఉన్న ఇతర దేశాలు కూడా పాక్ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడ్‌కు ఒప్పుకోనట్లు తెలిసింది.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల మేరకు.. ఈ ఏడాది ఆసియా కప్‌ను శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆడాలనుకుంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. శ్రీలంకకు రావాల్సిందేనని రాని పక్షంలో మాత్రం టోర్నీ నుంచి తప్పుకునే స్థితికి వచ్చినట్టు తెలుస్తున్నది. పాకిస్తాన్‌లో ఈ టోర్నీ నిర్వహిస్తే తాము ఆ దేశానికి రాబోమని టీమ్ ఇండియా ఇదివరకే తన నిర్ణయాన్ని ప్రకటించగా తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని సభ్య దేశాలు కూడా హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించినట్టు తెలుస్తున్నది. ఆసియా కప్ సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరిగే నిర్వహించే యోచనలో ఏసీసీ ఉంది.