కోహ్లీ భయపడొద్దు.. అలా ఆడు : విరాట్‌కు రవిశాస్త్రి కీలక సూచన
కొంతకాలంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు.
దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. స్పిన్ బౌలింగ్‌లో భయపడొద్దని, ఎదురుదాడికి దిగాలని సూచించాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘గత 2-3 ఏళ్లుగా కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో అవుటవుతున్నాడు. అతను తన పాదాలను మరింత ఎక్కువగా ఉపయోగించాలి. స్వీప్ షాట్లు ఆడాలి. సమయానికి తగ్గట్టు కదులుతూ షాట్ ఆడటానికి భయపడొద్దు. వారిని కలవరపెట్టేలా ఎదురుదాడికి దిగాలి. గతంలో భారీ పరుగులు చేసినప్పుడు కోహ్లీ ఆట అలాగే ఉండేది. ఇప్పుడు అతను పరిష్కారం కోసం అన్వేషించాలి.’ అని చెప్పుకొచ్చాడు.
కాగా, కొంతకాలంగా విరాట్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. తొలి టెస్టులో నిరాశపర్చిన అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 23 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను ఆఫ్ స్పిన్నర్ మెహిది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రీప్లేలో బంతి బ్యాటు ఎడ్జ్‌గా తాకిందని తేలగా.. విరాట్ రివ్యూ తీసుకోకపోవడంతో పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్పిన్నర్‌కు కోహ్లీ వికెట్ సమర్పించుకోవడం ఇది 39వ సారి.