ద్రవిడ్‌‌‌తో కలిసి మళ్లీ పనిచేయబోతున్న విక్రమ్ రాథోర్.. రాజస్థాన్ రాత మారుతుందా?

టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మరోసారి రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయబోతున్నాడు.

Update: 2024-09-20 11:55 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మరోసారి రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయబోతున్నాడు. టీమిండియాకు ద్రవిడ్ సపోర్టింగ్ స్టాఫ్‌లో విక్రమ్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ రాజస్థాన్ రాయల్స్‌‌కు సేవలందించనున్నారు. రాజస్థాన్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్ నియామకమైన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ రాథోర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా తీసుకున్నట్టు ఫ్రాంచైజీ శుక్రవారం వెల్లడించింది. విక్రమ్ నియామకంపై ద్రవిడ్ స్పందిస్తూ.. ‘చాలా సంవత్సరాలు విక్రమ్‌తో చాలా దగ్గరగా పనిచేశాను. అతని సాంకేతిక నైపుణ్యాలు, ప్రశాంతమైన ప్రవర్తన, భారత పరిస్థితులపై లోతైన అవగాహన రాయల్స్‌కు సరిగా సరిపోతాయని కచ్చితంగా చెప్పగలను.’ అని తెలిపాడు.

కాగా, విక్రమ్ భారత జట్టుతో దాదాపు ఐదేళ్లు పనిచేశాడు. రవిశాస్త్రి, ద్రవిడ్ సపోర్టింగ్ స్టాఫ్‌లో సేవలందించాడు. టీ20 వరల్డ్ కప్‌తో అతని పదవీకాలం ముగిసింది. ఐపీఎల్‌లో కోచ్‌గా ఉండటం అతనికి ఇది రెండోసారి. గతంలో పంజాబ్ కింగ్స్‌‌కు పనిచేశాడు. 1996-97 మధ్యలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విక్రమ్.. ఆరు టెస్టులు, ఏడు వన్డేలు మాత్రమే ఆడాడు.

మరోవైపు, ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ మరోసారి చాంపియన్‌గా నిలువలేకపోయింది. వచ్చే సీజన్‌లో టైటిలే లక్ష్యంగా పెట్టుకున్న ఫ్రాంచైజీ కోచింగ్ స్టాఫ్‌పై దృష్టి పెట్టింది. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన ద్రవిడ్, విక్రమ్‌లను తీసుకుంది మరి, వచ్చే సీజన్‌లోనైనా రాజస్థాన్ రాత మారుతుందో లేదో చూడాలి. 

Tags:    

Similar News