శతక్కొట్టిన తన్మయ్, తిలక్.. నాగాలాండ్‌తో సెమీస్‌లో తొలి రోజు హైదరాబాద్‌దే

రంజీ ట్రోఫీలో ప్లేట్ విభాగంలో వరుస విజయాలతో జోరు మీద ఉన్న హైదరాబాద్ జట్టు శుక్రవారం నాగాలాండ్‌తో సెమీస్‌ను మెరుగ్గా ఆరంభించింది.

Update: 2024-02-09 14:19 GMT

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ప్లేట్ విభాగంలో వరుస విజయాలతో జోరు మీద ఉన్న హైదరాబాద్ జట్టు శుక్రవారం నాగాలాండ్‌తో సెమీస్‌ను మెరుగ్గా ఆరంభించింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(164), కెప్టెన్ తిలక్ వర్మ(101) సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు పూర్తిగా హైదరాబాద్‌దే ఆధిపత్యం. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్లను కోల్పోయి 383 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రాహుల్ సింగ్(5) దారుణంగా నిరాశపరిచాడు. అయితే, మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్.. రోహిత్ రాయుడుతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.

నాగాలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ మూడో వికెట్‌కు 143 పరుగులు జోడించింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరగడంతో ఈ జోడీకి తెరపడింది. ఆ తర్వాత తన్మయ్ అగర్వాల్‌కు కెప్టెన్ తిలక్ వర్మ తోడయ్యాడు. నాగాలాండ్ బౌలర్లపై వీరు ఎదురుదాడికి దిగారు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంతో స్కోరు పరుగులు పెట్టింది. మూడో వికెట్‌కు ఈ జోడీ 155 పరుగులు జోడించడంతో స్కోరు 300 దాటింది. తన్మయ్ అగర్వాల్ అవుటవడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే తిలక్ కూడా వెనుదిరిగాడు. కాసేపటికే రవితేజ(15) అవుటయ్యాడు. అనంతరం నితేశ్ రెడ్డి(21 బ్యాటింగ్), ప్రగ్నాయ్ రెడ్డి(12 బ్యాటింగ్) ఆచితూచి ఆడి తొలి రోజు ముగించారు. నాగాలాండ్ బౌలర్లలో రాంగ్‌సెన్ జోనాథన్ 2 వికెట్లు తీయగా.. తహ్మీద్ రెహమాన్, ఇమ్లివతి లెమ్‌టూర్, ఖ్రీవిస్టో కెన్సె చెరో వికెట్ తీశారు. 

Tags:    

Similar News