బిహార్‌ను చిత్తు చేసిన ఆంధ్ర టీమ్.. రంజీ ట్రోఫీలో హ్యాట్రిక్ విజయం

రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉన్నది.

Update: 2024-02-05 14:52 GMT

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉన్నది. టోర్నీలో తాజాగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ప్లేట్ గ్రూపు బి మ్యాచ్‌లో సోమవారం బిహార్‌పై ఇన్నింగ్స్ 157 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆదివారమే బిహార్ 8 వికెట్లు తీసి ఆంధ్ర గెలుపు ముంగిట నిలిచింది. చివరి రోజైన సోమవారం మిగతా రెండు వికెట్లను తీసి గెలుపు లాంఛనం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 111/8తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బిహార్ మరో 13 పరుగులు జోడించి 124 పరుగుల వద్ద ఆలౌటైంది. బాబుల్ కుమార్(34) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరో ఇద్దరు ఖాతా కూడా తెరవలేదు. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్(4/35), శశికాంత్(3/8) బిహార్‌ను కూల్చడంలో కీలక పాత్ర పోషించారు.ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆంధ్ర విజయంలో కీలక పాత్ర పోషించిన నితిశ్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

కాగా, మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకే ఆలౌటవ్వగా.. ఆంధ్ర జట్టు 463 పరుగులు చేసి 281 పరుగుల ఆధిక్యం సాధించింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బిహార్ మరోసారి చెత్త బ్యాటింగ్‌తో ఘోర ఓటమిని చవిచూసింది. టోర్నీలో ఈ నెల 9 నుంచి 12 వరకు సొంతగడ్డపై జరిగే తదుపరి మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్‌తో ఆంధ్ర టీమ్ తలపడనుంది. ప్రస్తుతం గ్రూపు-బిలో ఆంధ్ర 22 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ముంబై 27 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 

Tags:    

Similar News