తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ.. రికార్డులు బద్దలు కొట్టిన హైదరాబాద్ కుర్రాడు

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ అగర్వాల్ సంచలనం సృష్టించాడు.

Update: 2024-01-26 14:33 GMT

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ అగర్వాల్ సంచలనం సృష్టించాడు. ప్లేట్ గ్రూపులో అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో తన్మయ్ ట్రిపుల్ సెంచరీ బాదాడు. 160 బంతుల్లో 323 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 21 సిక్స్‌లు, 33 ఫోర్లు ఉండటం గమనార్హం. మెరుపు ట్రిపుల్ సెంచరీతో తన్మయ్ అగర్వాల్ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. 147 బంతుల్లోనే త్రిశతకం పూర్తి చేసిన అగర్వాల్ ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. 2017లో సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరైస్ 191 బంతుల్లో ఈ ఘనత సాధించగా.. ఆ రికార్డును అగర్వాల్ అధిగమించాడు. అంతేకాకుండా, 119 బంతుల్లో ద్విశతకం చేసిన అగర్వాల్.. భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(113 బంతులు) తర్వాత ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అలాగే, రంజీ ట్రోఫీలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడు కూడా అగర్వాలే.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీద ఉన్న హైదరాబాద్ టీమ్ అరుణాచల్‌ ప్రదేశ్‌పై కూడా అదే జోరును కొనసాగించింది. తన్మయ్ అగర్వాల్(323 బ్యాటింగ్)‌కుతోడు రాహుల్ సింగ్(185) చెలరేగడంతో తొలి రోజు ముగిసే సమయానికి హైదరాబాద్ మొదటి ఇన్నింగ్స్‌లో 357 పరుగులు భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. మొదట బౌలర్లు రాణించడంతో అరుణాచల్ ప్రదేశ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 172 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. టెక్కీ డొరియా(97 నాటౌట్) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్, కార్తికేయ మూడేసి వికెట్లతో సత్తాచాటారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 529 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్, కెప్టెన్ రాహుల్ సింగ్ తొలి వికెట్‌కు 345 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అగర్వాల్‌తోపాటు అభిరథ్ రెడ్డి(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రెండో రోజే మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించే అవకాశం ఉంది.


Tags:    

Similar News