రెజ్లర్లకు రామ్‌దేవ్ బాబా మద్దతు.. బ్రిష్ భూషణ్‌పై సీరియస్
లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని గత కొంతకాలంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని గత కొంతకాలంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెజ్లర్లకు పతంజలి ఆయుర్వేద్ సంస్థ అధినేత, యోగా గురువు బాబా రామ్‌దేవ్ మద్దతు పలికారు. రాజస్థాన్‌లోని భిల్వారాలో మూడు రోజుల యోగా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ‘రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ వేధింపులకు వ్యతిరేకంగా, రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టడం సిగ్గు చేటు. అలాంటి వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి.
తల్లులు, అక్క చెల్లెళ్లు, కుమార్తెల గురించి ప్రతిరోజూ అర్థం పర్థం లేని మాటలు చెబుతుంటాడు’ అని రామ్‌దేవ్ అన్నారు. అదేవిధంగా బ్రిష్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు అయినా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై రామ్‌దేవ్ బాబా స్పందించాలని మీడియా ప్రశ్నించింది. తాను కేవలం ప్రకటన మాత్రమే చేయగలనని బదులు ఇచ్చారు. రాజకీయంగా సమాధానం చెప్పగలను కానీ మేథోపరంగా తనకు వైకల్యం లేదన్నారు. ఈ దేశం కోసం తనకంటూ విజన్ ఉన్నట్టు చెప్పారు. రాజకీయ కోణం నుంచి ప్రకటన చేస్తే అది పెద్ద దుమారం లేపుతుందని, ఉరుములు మెరుపులు వస్తాయని వ్యాఖ్యానించారు.