దిశ, స్పోర్ట్స్ : ఇటలీ టెన్నిస్ స్టార్, వరల్డ్ నం.1 జెన్నిక్ సిన్నర్ చరిత్ర సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్(ఏటీపీ) ఫైనల్స్ చాంపియన్‌గా అవతరించాడు. సిన్నర్‌కు ఇదే తొలి ఏటీపీ ఫైనల్స్ టైటిల్. అంతేకాకుండా, 55 ఏళ్ల టోర్నీ చరిత్రలో టైటిల్ గెలిచిన మొట్టమొదటి ఇటలీ ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో సిన్నర్ మొదటి నుంచి సంచలన ప్రదర్శన చేశాడు.
టురిన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌లోనూ ఈ ఇటలీ ఆటగాడు అదే జోరును కొనసాగించాడు. అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌ను 4-6, 4-6 తేడాతో ఓడించాడు. గంటా 24 నిమిషాలపాటు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రిట్జ్ ప్రతిఘటించినప్పటికీ.. సిన్నర్ తనదైన స్టైల్‌లో రెండు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. తొలి సెట్‌లో ఆరు గేములు ముగిసే వరకు 3-3తో ఇరువురు సమవుజ్జీలుగా నిలువగా ఆ తర్వాత సిన్నర్ దూకుడు పెంచాడు. 7వ గేమ్‌లో బ్రేక్ పాయింట్ పొందిన అతను వరుసగా 8వ గేమ్‌ను కూడా నెగ్గి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 9వ గేమ్‌లో ఫ్రిట్జ్ సర్వీస్ కాపాడుకోగా.. సిన్నర్ 10వ గేమ్‌ను నెగ్గి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు.
రెండో సెట్‌లోనూ అదే సిన్నర్ అదే జోరు కొనసాగించాడు. 5వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లిన అతను 10వ గేమ్‌ను నెగ్గి టైటిల్ ఎగరేసుకుపోయాడు. టోర్నీలో సిన్నర్ ప్రతి మ్యాచ్‌నూ రెండు సెట్లలోనే నెగ్గడం గమనార్హం. ఈ సీజన్‌లో సిన్నర్ తన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకున్న అతను యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా, తొలిసారిగా వరల్డ్ నం.1గా అవతరించాడు. తాజాగా ఏటీపీ ఫైనల్స్ విజేతగా నిలిచాడు.తద్వారా ఈ సీజన్‌ను సిన్నర్ టాప్ ర్యాంకర్‌గా ముగించాడు.