ఆటగాళ్లదే కీలక పాత్ర.. కోచ్‌ల ప్రమేయం అంతంత మాత్రమే : Virender Sehwag

Update: 2023-06-29 13:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2022 టీ20 ప్రపంచకప్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ విఫలమయ్యాడంటూ వస్తున్న విమర్శలపై టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. టీమ్ విజయంలో ఆటగాళ్లదే కీలక పాత్రని, కోచ్‌ల ప్రమేయం అంతంత మాత్రమేనని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

ఐసీసీ నిర్వహించిన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సెహ్వాగ్.. ద్రవిడ్‌కు అండగా నిలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల ప్రదర్శనపైనే కోచ్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయని తెలిపాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేసిన గ్యారీ కిరిస్టెన్.. అనంతరం చాలా జట్లకు కోచ్‌గా వ్యవహరించినా.. విజేతగా నిలపలేకపోయాడని గుర్తు చేశాడు.

రాహుల్ ద్రవిడ్ ఉత్తమ కోచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లే సరిగ్గా ఆడాలి. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు గ్యారీ కిరిస్టన్ కోచ్‌గా ఉన్నారు. ఆ టోర్నీ అనంతరం ఆయన చాలా జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. కానీ, ఒక్క జట్టును కూడా విజేతగా నిలపలేకపోయాడు.


Similar News