PV Sindhu : పెళ్లి పీటలెక్కబోతున్న సింధు.. వరుడు ఎవరో తెలుసా?.. పెళ్లి ఎప్పుడంటే?

భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నది.

Update: 2024-12-02 17:43 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తా సాయిని ఆమె పెళ్లి చేసుకోనుంది. ఈ నెల 22న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ విషయాన్ని సింధు తండ్రి పీవీ రమణ సోమవారం మీడియాకు వెల్లడించారు.

ఈ నెల 20 నుంచి మ్యారేజ్ ఈవెంట్స్ ప్రారంభంకానున్నాయి. 22న ఉదయ్‌పూర్‌లో వివాహం జరగనుండగా.. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ‘రెండు కుటుంబాలు ఒక్కరికొకరు తెలుసు. కానీ, నెలలోనే అంతా ఖరారైంది. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెల 22న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్. వచ్చే సీజన్ సింధుకు చాలా ముఖ్యమైనది. త్వరలోనే ఆమె శిక్షణ మొదలుపెట్టనుంది.’ అని ఆమె తండ్రి తెలిపారు.

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సింధు బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఆదివారం సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ విజేతగా నిలిచింది. మరుసటి రోజే సింధు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరోవైపు, సింధును పెళ్లి చేసుకోబోతున్న వెంకట దత్తా సాయిది హైదరాబాదే. పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.

Tags:    

Similar News