Shoaib Akhtar : పీసీబీ నిర్ణయాన్ని తప్పుబట్టిన షోయబ్ అక్తర్
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో పీసీబీ నిర్ణయాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు.
దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ విషయంలో పీసీబీ నిర్ణయాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టును భారత్‌కు పంపాలని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో తమ జట్టు భారత్‌ను ఓడించేలా సన్నద్ధం చేయాలని పీసీబీకి సూచించాడు. భారత్‌తో స్నేహ హస్తం చాచి ఆ దేశంలో పర్యటించాలని సూచించాడు. భారత్‌లో పర్యటించి వారిని సొంతగడ్డపై ఓడించాలని కోరాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పొందిన పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్పేందుకు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయంలో అధిక మొత్తాన్ని డిమాండ్ చేయడం సబబే అని అక్తర్ అన్నాడు. ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు తెలిపాడు. హైబ్రిడ్ మోడల్‌కు ఇప్పటికే పీసీబీ అంగీకరించినట్లు తాను భావిస్తున్నట్లు తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌ను వేదికగా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్, ఫైనల్‌కు భారత్ చేరినా ఈ రెండు మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహించాలని భావిస్తున్నారు. ఒక వేళ భారత్ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు క్వాలిఫై కానీ పక్షంలో పాకిస్తాన్‌లోనే ఈ రెండు మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.