పారిస్ ఒలింపిక్స్‌కు సింధుతోసహా ఏడుగురు క్వాలిఫై
పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కోటాలు ఖరారయ్యాయి.
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కోటాలు ఖరారయ్యాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) పారిస్ ఒలింపిక్స్ ర్యాంకింగ్స్ ఆధారంగా.. నాలుగు కేటగిరీల్లో ఏడుగురు షట్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ర్యాంకింగ్స్‌లో వివిధ విభాగాల్లో టాప్-16 ఆటగాళ్లు మాత్రమే విశ్వక్రీడలకు క్వాలిఫై అవుతారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ఒలింపిక్స్ బెర్త్‌లు సాధించారు.
పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 25వ ర్యాంక్‌లో ఉన్న తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. సింధుకు వరుసగా ఇది మూడో ఒలింపిక్స్. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో క్రీడల్లో కాంస్యం సాధించిన ఆమె.. ఈ సారి స్వర్ణమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగనుంది. మరోవైపు, గత విశ్వక్రీడల్లో సాత్విక్-చిరాగ్ జోడీ గ్రూపు దశలోనే వెనుదిరిగింది. అయితే, కొంతకాలంగా సంచలన ప్రదర్శన చేస్తున్న ఈ జంటపై ఈ సారి పతక ఆశలు భారీగా ఉన్నాయి.