పీటీ ఉష‌కు ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు

భారత దిగ్గజ స్ప్రింటర్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్రెసిడెంట్ పీటీ ఉషకు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆదివారం ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు ప్రదానం చేసింది.

Update: 2024-02-04 15:53 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ స్ప్రింటర్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్రెసిడెంట్ పీటీ ఉషకు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆదివారం ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..‘నేను సాధించిన విజయాలను నేటికీ గుర్తుంచుకున్నందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత క్రీడాకారులు పొందుతున్న సౌకర్యాలు, విదేశీ ట్రైనింగ్, పోషకాహారం, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ వంటివి నా కాలంలో లేవు. ప్రస్తుతం నేను ఐవోఏలో పనిచేస్తున్నాను. ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌పై మా ఫోకస్ ఉంది. ఆ తర్వాత 2036 నాటికి భారత్‌ను క్రీడా శక్తిగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌పై దృష్టి పెడతాం.’ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పీటీ ఉష దేశంలో ఎందరికో స్ఫూర్తి అని అన్నారు. కాగా, పీటీ ఉష కంటే ముందు ఈ అవార్డును విజయ్ అమృతరాజ్ (టెన్నిస్), ప్రకాష్ పదుకొణె (బ్యాడ్మింటన్‌), సునీల్ గావస్కర్ (క్రికెట్‌), మాజీ స్ప్రింటర్ మిల్కా సింగ్ అందుకున్నారు. 1997-2000 మధ్యలో పీటీ ఉష భారత్ తరపున ఎన్నో ఘనతలు సాధించింది. ఆమె కెరీర్‌లో 103 అంతర్జాతీయ పతకాలు గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణ పతకాలు, 7 రజత పతకాలు సాధించింది. మూడు సార్లు ఒలింపిక్స్‌లోనూ పాల్గొంది. 

Tags:    

Similar News