సెమీస్‌లోకి పాట్నా పైరేట్స్.. ఢిల్లీపై ఉత్కంఠకర విజయం

గెలిచిన జట్లు శుక్రవారం ఫైనల్ మ్యాచ్ ఆడతాయి.

Update: 2024-02-26 19:37 GMT

దిశ, స్పోర్ట్స్: ‘ప్రో కబడ్డీ లీగ్’(పీకేఎల్)లో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్-1లో దబాంగ్ ఢిల్లీపై పాట్నా పైరేట్స్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఢిల్లీ 35పాయింట్లు సాధించగా, పాట్నా 37 పాయింట్లు దక్కించుకుంది. దీంతో రెండు పాయింట్ల తేడాతో పాట్నా విజయం సాధించి, సెమీస్‌లోకి దూసుకెళ్లింది. టోర్నీ నుంచి ఢిల్లీ నిష్క్రమించింది. పాట్నా జట్టులో కెప్టెన్ సచిన్.. 9 రైడింగ్ పాయింట్లు తీసుకురాగా, మంజీత్, సుధాకర్, సందీప్ కుమార్ ఐదేసి పాయింట్లు సాధించారు. ఢిల్లీ జట్టులో కెప్టెన్ అషు మాలిక్ ఒక్కడే ఏకంగా 19 రైడింగ్ పాయింట్లు తీసుకొచ్చాడు. కానీ, మిగతావారెవ్వరూ జట్టులో అంతగా రాణించలేకపోయారు. ఇదే వేదికగా జరిగిన రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై హర్యానా స్టీలర్స్ ఘన విజయం సాధించింది. నిర్ణీత సమయంలో గుజరాత్ 42 పాయింట్లు తన ఖాతాలో వేసుకోగా, గుజరాత్ 25 పాయింట్లు మాత్రమే సాధించుకోగలిగింది. దీంతో గుజరాత్‌పై హర్యానా 42-25 తేడాతో గెలుపొంది, సెమీస్‌లోకి ప్రవేశించింది. గుజరాత్ ఇంటిబాట పట్టింది. హర్యానా తరఫున రైడర్ వినయ్ 12పాయింట్లతో చెలరేగగా, శివమ్ 8పాయింట్లు, మోహిత్ నందాల్ 7 పాయింట్లు సాధించారు. ఇక, గుజరాత్ తరఫున పర్తీక్(5), రాకేశ్(5), సోను(5) మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. బుధవారం జరగనున్న సెమీఫైనల్స్‌లో తొలి మ్యాచ్‌లో పుణెరీ పల్టాన్స్, పాట్నా పైరేట్స్ తలపడనుండగా, రెండో మ్యాచ్‌లో జైపూర్, హర్యానా పోటీ పడనున్నాయి. ఇందులో గెలిచిన జట్లు శుక్రవారం ఫైనల్ మ్యాచ్ ఆడతాయి.


Tags:    

Similar News