PR Sreejesh : ముగింపు అంటే ఇది..ఒలింపిక్స్ పతకంతో వీడ్కోలు పలికిన శ్రీజేష్
శ్రీజేష్ తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో మ్యాచే అతనికి చివరిది.
దిశ, స్పోర్ట్స్ : ఆడే ఆఖరి మ్యాచే ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తెచ్చేది అయితే.. ఏ ఆటగాడికైనా అంత కంటే గొప్ప ముగింపు ఏముంటుంది. భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ పీ.ఆర్. శ్రీజేష్ ప్రస్తుతం ఆ ఆనంద క్షణాలనే ఆస్వాదిస్తున్నాడు. శ్రీజేష్ తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో మ్యాచే అతనికి చివరిది. విశ్వక్రీడల ప్రారంభానికి ముందే పారిస్ ఒలింపిక్స్‌లో తన చివరి మ్యాచ్ అని ప్రకటించిన అతను.. దేశానికి కాంస్య పతకం అందించి హాకీకి టాటా చెప్పాడు.
దాదాపు రెండు దశాబ్దాలుగా భారత హాకీకి శ్రీజేష్ వెన్నెముకగా నిలిచాడు. కేరళకు చెందిన శ్రీజేష్ హాకీ ఐకాన్‌గా, గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీగా గుర్తింపు పొందాడు. గోల్‌కీపర్‌గా అతని అద్భుతాలు అలాంటివి మరి. 2004లో జూనియర్ జాతీయ జట్టుకు ఎంపికైన అతను అంచెలంచెలుగా ఎదిగాడు. రెండేళ్ల వ్యవధిలోనే 2006లో జాతీయ జట్టులోకి వచ్చాడు. గోల్ కీపర్‌గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ షూటౌట్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శ్రీజేష్ గోల్ పోస్టుకు అడ్డుగోడలా నిలబడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది అతని ప్రదర్శనకు చిన్న ఉదాహరణ మాత్రమే. అతని కెరీర్‌లో ఇలాంటి అద్భుత విజయాలన్నో జట్టుకు అందించాడు.
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడంలోనూ అతని పాత్ర గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. శ్రీజేష్ పాల్గొన్న నాలుగో ఒలింపిక్స్ ఇవి. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత జట్టును అతనే నడిపించాడు. ఆ విశ్వక్రీడల్లో అతని సారథ్యంలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఒకరకంగా భారత హాకీ పునర్‌వైభవానికి నాంది రియోలోనే పడిందని చెప్పాలి. శ్రీజేష్‌ను జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జట్టు గ్రూపు దశను దాటింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే టోక్యో బరిలో నిలిచిన భారత్ 41 ఏళ్ల పతక నిరీక్షణ తెరదించుతూ కాంస్యం సాధించింది. అలాగే, 2014, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన జట్టులో శ్రీజేష్ సభ్యుడు. 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన జట్లలోనూ ఉన్నాడు. మొత్తంగా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్ తరపున 328 మ్యాచ్‌లు ఆడాడు.