క్రీడా దేశంగా సరైన మార్గంలో వెళ్తున్నాం : ప్రధాని మోడీ

క్రీడా దేశంగా భారత్ సరైన మార్గంలో వెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

Update: 2023-10-10 15:14 GMT

న్యూఢిల్లీ : క్రీడా దేశంగా భారత్ సరైన మార్గంలో వెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్లతో ప్రధాని మోడీ మంగళవారం సమావేశమయ్యారు. ఆసియా గేమ్స్‌లో పతకాల పంట పండించిన భారత అథ్లెట్లను ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఆసియా గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాలు దేశ విజయానికి నిదర్శనమని, క్రీడా దేశంగా సరైన మార్గంలో వెళ్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆసియా క్రీడల్లో ప్రదర్శన దేశంలో క్రీడల భవిష్యత్తుకు మంచి సూచన అని, కొత్త తరానికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు.

‘100 పతకాలకుపైగా సాధించారు. వచ్చే ఎడిషన్‌లో ఈ రికార్డును అధిగమించాలి. పారిస్ ఒలింపిక్స్‌లో మీ అత్యుత్తమ ప్రదర్శన చేయండి.’ అని ప్రధాని చెప్పారు. అథ్లెట్లు అత్యుత్తమంగా రాణించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, వచ్చే ఐదేళ్లలో అథ్లెట్ల కోసం, మౌళిక సదుపాయాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. అలాగే, పాఠశాలల్లో డ్రగ్స్, డోపింగ్‌లపై అవగాహన కల్పించాలని ప్రధాని అథ్లెట్లను కోరారు. కాగా, ఆసియా క్రీడల్లో టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్ 107 పతకాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.


Similar News