ఐసీసీ అవార్డుకు బుమ్రా నామినేట్.. కమిన్స్‌తో పోటీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సంచలన ప్రదర్శన చేసిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఐసీసీ అవార్డుపై కన్నేశాడు.

Update: 2025-01-07 12:32 GMT

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సంచలన ప్రదర్శన చేసిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఐసీసీ అవార్డుపై కన్నేశాడు. డిసెంబర్‌కు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచాడు. అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్లను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. బుమ్రాతోపాటు అవార్డుకు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, సౌతాఫ్రికా బౌలర్ ప్యాటర్సన్ పోటీపడుతున్నారు. ఆసిస్ గడ్డపై బుమ్రా రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో 32 వికెట్లు తీశాడు. డిసెంబర్‌లో జరిగిన మూడు టెస్టుల్లో తీసినవే 22 వికెట్లు. సగటు 14.22 ఉండటం విశేషం.

పెర్త్ టెస్టులో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా మ్యాచ్‌ల్లో కూడా జట్టు కోసం చేసిన అతని పోరాటం అసామాన్యమే. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అతనికే దక్కింది. అలాగే, టెస్టు ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన భారత బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌‌లో బుమ్రా తొలిసారిగా ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు సాధించాడు.

మరోవైపు, కమిన్స్ కెప్టెన్‌గా, బౌలర్‌గా ఆకట్టుకున్నాడు. 10 ఏళ్ల తర్వాత ఆసిస్‌కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందించడంతోపాటు జట్టును తొలిసారిగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు. డిసెంబర్‌లో మూడు మ్యాచ్‌ల్లో 17.64 సగటుతో 17 వికెట్లు తీశాడు. ఇక, సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడంలో ప్యాటరన్స్ కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక, పాక్ మ్యాచ్‌ల్లో కలిపి 13 వికెట్లు తీశాడు.

Tags:    

Similar News