పారిస్ ఒలింపిక్స్‌కు సుమిత్ క్వాలిఫై

భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్‌ బెర్త్ సాధించాడు.

Update: 2024-06-22 12:48 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్‌ బెర్త్ సాధించాడు. మెన్స్ సింగిల్స్ ఈవెంట్‌లో అతను పోటీపడనున్నాడు. ఈ విషయాన్ని సుమిత్ శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించానని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఒలింపిక్స్‌ నాకు చాలా స్పెషల్. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం నా కెరీర్‌ ప్రత్యేకమైనది. అప్పటి నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నా. నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎదురుచూస్తున్నా.’అని తెలిపాడు.

కాగా, టోక్యో ఒలింపిక్స్‌-2020లో పాల్గొన్న సుమిత్ రెండో రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్(1992, 2000) తర్వాత వరుసగా సమ్మర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెండో భారత ఆటగాడిగా సుమిత్ నిలిచాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో సుమిత్ 71వ ర్యాంక్‌లో ఉన్నాడు. టాప్-56 మంది ప్లేయర్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. అయితే, ఒక దేశం నుంచి గరిష్టంగా నాలుగురు మాత్రమే పాల్గొనడానికి వీలు ఉండటంతో సుమిత్‌కు కలిసొచ్చింది. పురుషుల డబుల్స్‌లో భారత సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్న.. శ్రీరామ్ బాలాజీతో కలిసి విశ్వక్రీడల్లో పాల్గొననున్నాడు. వచ్చే నెల 4న ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అధికారికంగా ఎంట్రీ లిస్ట్‌ను రిలీజ్ చేయనుంది.  


Similar News