నిశాంత్‌కు ఒలింపిక్స్ బెర్త్.. పురుషుల విభాగంలో భారత్‌కు తొలి కోటా

భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

Update: 2024-05-31 17:23 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో అతను పురుషుల 71 కేజీల కేటగిరీలో ఒలింపిక్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో నిశాంత్ 5-0 తేడాతో మోల్డోవాకు చెందిన వాసిలే సెబోటారిని చిత్తు చేశాడు. ఈ బౌట్‌లో కచ్చితమైన పంచ్‌లతో నిశాంత్ ప్రత్యర్థిపై దాడి చేశాడు. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన అతను ఏకపక్ష విజయం అందుకున్నాడు.ఒలింపిక్స్‌ కోటా బౌట్‌గా ఉన్న ఈ మ్యాచ్‌లో నెగ్గి ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. పురుషుల విభాగంలో భారత్‌కు ఇదే తొలి ఒలింపిక్స్ కోటా. మొత్తంగా ఇది 4వ బెర్త్.

అలాగే, అమిత్ పంఘల్(51 కేజీలు), సచిన్ సివాచ్(57 కేజీలు) సైతం ఒలింపిక్స్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచారు. క్వార్టర్ ఫైనల్‌లో సచిన్ 4-1 తేడాతో శామ్యూల్(ఫ్రాన్స్)ను ఓడించి సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు, మూడో రౌండ్‌లో అమిత్ 5-0 తేడాతో కిమ్ ఇన్(సౌత్ కొరియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. కోటా బౌట్‌లో కార్లో పాలమ్(ఫిలిప్పీన్స్)తో సచిన్, లియు చువాంగ్(చైనా)తో అమిత్ తలపడనున్నారు. ఈ బౌట్‌లో నెగ్గితే ఒలింపిక్స్‌కు అర్హత సాధించనున్నారు. మరోవైపు, సంజీత్ కుమార్(పురుషుల 92 కేజీలు), అరుంధతి చౌదరి(మహిళల 66 కేజీలు), అంకుషిత(మహిళల 60 కేజీలు) తమ బౌట్లలో ఓడిపోయి ఒలింపిక్స్ ఆశలను గల్లంతు చేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఇదే చివరి టోర్నీ. 


Similar News