Pankaj Advani : బిలియార్డ్స్ వరల్డ్ టైటిల్ భారత్‌దే.. మరోసారి సత్తా చాటిన పంకజ్ అద్వాణీ
ఇండియన్ క్యూ స్పోర్ట్ లెజెండ్ పంకజ్ అద్వాణీ 18వ ప్రపంచ బిలియార్డ్స్, 28వ బిలియార్డ్స్, స్నూకర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ క్యూ స్పోర్ట్ లెజెండ్ పంకజ్ అద్వాణీ 18వ ప్రపంచ బిలియార్డ్స్, 28వ బిలియార్డ్స్, స్నూకర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. శనివారం ఖతార్‌లోని దోహాలో జరిగిన 2024 ఐబీఎస్‌ఎఫ్ 150 అప్ బిలియార్డ్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది. అద్వాణీ ఇంగ్లాండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌ను ఫైనల్‌లో 4-2 తేడాతో ఓడించాడు. 150 అప్ ఫార్మాట్ ఐబీఎస్ఎఫ్ బిలియార్డ్స్ ఛాంపియన్ షిప్‌ను వరుసగా ఏడోసారి పంకజ్ అద్వాణీ గెలుచుకున్నాడు. అద్వాణీ ఆట మొదటి నుంచి ప్రత్యర్థిని డామినేట్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ మూడు ఫ్రేమ్‌ల్లో (151-94, 151-0, 150-84) లీడ్ సాధించాడు. అయితే ఇంగ్లాండ్ ఆటగాడు హాల్ గట్టి పోటీని ఇచ్చి వరుసగా రెండు ఫ్రేమ్‌లు (151-74, 151-6) గెలిచి ఆటలో నిలిచాడు.
తనదైన శైలిలో..
39 ఏళ్ల ఇండియన్ ఛాంపియన్ ఆరో ఫ్రేమ్ నుంచి మళ్లీ గేమ్‌లో గట్టి పోటీనిచ్చి 152-46తో టైటిల్ సొంతం చేసుకున్నాడు. తద్వారా 28వ ప్రపంచ బిలియార్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్(ఐబీఎస్ఎఫ్) వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. 18 బిలియార్డ్స్ టైటిల్స్, ఒక వరల్డ్ టీమ్ బిలియార్డ్స్ టైటిల్, స్నూకర్ కాంపిటేషనల్‌లో తొమ్మిది టైటిల్‌లను పంకజ్ అద్వాణీ తన ఖాతాలో వేసుకున్నాడు.