పాక్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సంచలన నిర్ణయం..
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బిస్మా మరూఫ్ గుడ్ బై చెప్పింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బిస్మా మరూఫ్ గుడ్ బై చెప్పింది. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె బుధవారం వెల్లడించింది. ‘పాకిస్తాన్‌కు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నా. ఐసీసీ ఉమెన్స్ చాంపియన్‌షిప్ సైకిల్ ప్రారంభదశలో ఉన్నది. టీ20 వరల్డ్ కప్-2024 ఏడాది కంటే ఎక్కువ సమయం ఉన్నది. నేను కెప్టెన్‌గా తప్పుకోవడానికి ఇదే సరైన సమయం’ అని మరూఫ్ తెలిపింది.
అయితే, తాను జట్టులో ప్లేయర్‌గా తన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. మరూఫ్ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆమోదించింది. కొత్త కెప్టెన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో పాక్ జట్టు గ్రూపు దశకే పరిమితమై ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మరూఫ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా, మరూఫ్ 2017 జట్టు పగ్గాలు చేపట్టింది. ఆమె నాయకత్వంలో పాక్ జట్టు 34 వన్డేల్లో 16 విజయాలు, 62 టీ20ల్లో 27 విజయాలు సాధించింది.