పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్..

ఆసియా కప్ ఆతిథ్యంపై సందిగ్ధం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది.

Update: 2023-06-09 14:41 GMT

న్యూఢిల్లీ : ఆసియా కప్ ఆతిథ్యంపై సందిగ్ధం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్నాయి. అయితే, ఈ టోర్నీ కూడా పాక్ నుంచి తరలిపోయే అవకాశాలు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి మార్చాలని ఐసీసీ షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్టు సమాచారం. ఆసియా కప్‌‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాక్‌లో పర్యటించిందని బీసీసీఐ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దాంతో టోర్నీ వేదికను శ్రీలంక లేదా బంగ్లాదేశ్‌కు మార్చాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరిగితే బీసీసీఐ ఆసియా కప్ నిర్ణయాన్నే వెల్లడించే అవకాశం ఉంది. టోర్నీలో భారత జట్టు పాల్గొనకపోతే ఐసీసీకి భారీ నష్టం వాటిల్లనుంది.

ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి తరలించి వెస్టిండీస్, అమెరికాలో సంయుక్తంగా నిర్వహించాలని ఐసీసీ ఆలోచిస్తున్నది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు విండీస్, అమెరికా వద్ద ఉన్నాయి. అయితే, అమెరికాలోని స్టేడియాలు ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. దాంతో మెగా టోర్నీ వేదికను ఇంగ్లాండ్‌కు తరలించి, ప్రతిఫలంగా చాంపియన్స్ ట్రోఫీని అక్కడ నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నది. వేదికను మార్చడం ద్వారా పాక్ క్రికెట్ బోర్డుకు వచ్చే నష్టాన్ని కూడా భరించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలినట్టే.


Similar News