వన్డే వరల్డ్ కప్‌పై ఫోకస్.. భారత్‌‌కు రావడంపై పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

ఈ ఏడాది భారత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Update: 2023-03-05 14:28 GMT

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మధ్య ఆసియా కప్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అతని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజాగా పాక్ మీడియాతో మాట్లాడిన బాబర్.. భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టామని చెప్పాడు. ‘టోర్నీమెంట్‌లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తాం. మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి పరుగులు చేసేందుకు కృషి చేస్తా. మాది మంచి కాంబినేషన్. అయితే, ప్రతి ఇన్నింగ్స్‌లో ఇది జరగకపోవచ్చు. అందుకే కేవలం ఇద్దరిపై మాత్రమే జట్టు ఆధారపడొద్దు. అలాగే, విజేతగా నిలబట్టే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.’ అని బాబర్ తెలిపాడు.

వన్డే వరల్డ్ కప్‌‌పై దృష్టి పెట్టామని బాబర్ తెలపడంతో భారత్‌కు వచ్చేందుకు పాక్ సిద్ధమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, పాక్‌లో జరిగే ఆసియా కప్‌లో టీమ్ ఇండియా పాల్గొనదని బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పష్టం చేయగా.. భారత జట్టు పాకిస్తాన్‌కు రాకపోతే వన్డే వరల్డ్ కప్‌ కోసం తాము కూడా భారత్‌‌లో పర్యటించమని పీసీబీతోపాటు ఆ జట్టు ఆటగాళ్లు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్‌ను తటస్థ వేదికగా నిర్వహించాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News