ఐపీఎల్ మత్తే టీమ్ ఇండియా కొంపముంచింది : వసీం జాఫర్

ఐపీఎల్ మత్తే టీమిండియా కొంపముంచిందని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.

Update: 2023-06-13 17:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ మత్తే టీమిండియా కొంపముంచిందని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. వారం రోజుల ప్రిపరేషన్ టీమిండియాకు సరిపోలేదన్నాడు. ముఖ్యంగా ఆటగాళ్లు ఐపీఎల్ మత్తును వీడలేక మూల్యం చెల్లించుకున్నారని తెలిపాడు. ఆసీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఫలితంపై మాట్లాడిన వసీం జాఫర్ ప్రిపరేషన్‌కు టైమ్ లేకపోవడమే టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'మే 28న ఐపీఎల్ ఫైనల్ ముగిసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7న మొదలైంది. టీమిండియా ప్రిపరేషన్‌కు వారం రోజుల సమయం మాత్రమే లభించింది. ఈ సమయం ఏ మాత్రం సరిపోదు.

'ఐపీఎల్‌లో నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన భారత బౌలర్లు డబ్ల్యూటీసీ ఫైనల్లో లాంగ్ స్పెల్స్ వేయడంలో చాలా ఇబ్బంది పడ్డారు. రోజుకు 18 ఓవర్లు వేయడం వారి వల్ల కాలేదు. ఇది ఓటమికి దారి తీసింది. అంతేకాకుండా బ్యాటర్లు కూడా ఐపీఎల్ మత్తును వీడలేకపోయారు. దూరంగా వెళ్తున్న బంతులను వదల్లేకపోయారు. వెంటాడి మరీ మూల్యం చెల్లించుకున్నారు.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేపై జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఫైనల్లో రహానే అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి పరుగులు చేశాడని తెలిపాడు. భారీ లక్ష్య ఛేదనలోనూ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున రహానే ఒక్కడే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 89, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో రాణించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దూకుడైన ఆటతీరును ప్రదర్శించిన రహానే.. చాలా రోజుల తర్వాత మళ్లీ టీమిండియాకు ఎంపికయ్యాడు.


Similar News