షూటింగ్ ఒలింపిక్ ట్రయల్స్‌లో సత్తాచాటిన ఇషా సింగ్
పారిస్ ఒలింపిక్ మొదటి సెలెక్షన్ ట్రయల్స్‌లో భారత షూటర్, తెలుగమ్మాయి ఇషా సింగ్ సత్తాచాటింది.
దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలో జరుగుతున్న పారిస్ ఒలింపిక్ మొదటి సెలెక్షన్ ట్రయల్స్‌లో భారత షూటర్, తెలుగమ్మాయి ఇషా సింగ్ సత్తాచాటింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా సింగ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 585 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రెసిషన్ సెక్షన్‌లో 291 స్కోరు, ర్యాపిడ్ ఫైర్ సెక్షన్‌లో 294 స్కోరు చేసింది. సిమ్రాన్‌ప్రీత్ కౌర్(583), మను భాకర్(582) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలువగా.. అభిద్న్యా పాటిల్(577), రిథమ్ సంగ్వాన్(574) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శనివారం ఫైనల్ జరగనుంది. అక్కడ ఇషా సింగ్‌కు మను భాకర్, సిమ్రాన్‌ప్రీత్ కౌర్ నుంచి సవాల్ ఎదురుకానుంది. మరోవైపు, పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ క్వాలిఫికేషన్‌లో భవేష్ షెకావత్(580) అగ్రస్థానంలో నిలిచాడు. విజయ్‌వీర్(579), అనీశ్ భన్వాలా(578), ఆదర్శ్ సింగ్(572), అంకుర్ గోయెల్(564) తర్వాతి స్థానాల్లో నిలిచారు. నాలుగు ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన వారు నేరుగా పారిస్ ఒలింపిక్ బెర్త్ పొందుతారు.