యూఎస్ ఓపెన్‌లో జకోవిచ్ శుభారంభం

25వ గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టిన దిగ్గజ క్రీడాకారుడు, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ టోర్నీలో శుభారంభం చేశాడు.

Update: 2024-08-27 19:18 GMT

దిశ, స్పోర్ట్స్ : 25వ గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టిన దిగ్గజ క్రీడాకారుడు, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ టోర్నీలో శుభారంభం చేశాడు. అలవోకగా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో జకో 6-2, 6-2, 6-4 తేడాతో అన్‌సీడ్ ప్లేయర్ రాడు ఆల్బోట్(మోల్డోవా)ను చిత్తు చేశాడు. వరుసగా మూడు సెట్లను గెలుచుకుని ముందడుగు వేశాడు. తొలి రెండు సెట్లలో జకో హవానే కొనసాగగా.. ఆఖరిదైన మూడో సెట్‌లో ప్రత్యర్థి కాస్త పోటీనిచ్చినా నిలువరించాడు.

డెన్మార్క్ ప్లేయర్, 15వ సీడ్ హోల్గర్ రూనెకు తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. అన్‌సీడ్ ప్లేయర్ నకాషిమా చేతిలో 6-2, 6-1, 6-4 తేడాతో ఓడిపోయాడు. 7వ సీడ్ హుర్కాజ్, అమెరికా సంచలనం టియాఫో, 9వ సీడ్ డిమిత్రోవ్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్‌కు నిరాశే ఎదురైంది. నెదర్లాండ్స్ ప్లేయర్ టాలన్ గ్రీక్‌పూర్ చేతిలో 1-6, 3-6, 6-7(6-8) తేడాతో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు.

మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో పొలాండ్ స్టార్, వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ శుభారంభం చేసింది. అయితే, తొలి రౌండ్‌లో ఆమెకు అన్‌సీడ్ క్రీడాకారిణి రాఖీమోవా కాస్త టెన్షన్ పెట్టింది. విజయం కోసం కాస్త శ్రమించిన స్వైటెక్ 6-4, 7-6(8-6) తేడాతో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది. అలాగే, గతేడాది ఫైనలిస్ట్ సబలెంక 6-3, 6-3 తేడాతో ప్రిస్సిల్లా హాన్(ఆస్ట్రేలియా)ను ఓడించి ముందడుగు వేసింది. 

Tags:    

Similar News