ఫ్రెంచ్ ఓపెన్‌లో జకోవిచ్ జోరు.. అలవోకగా మూడో రౌండ్‌కు

ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది.

Update: 2024-05-30 18:12 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. అతను మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో జకోవిచ్ 6-4, 6-1, 6-2 తేడాతో స్పెయిన్ ప్లేయర్ కార్బల్లెస్ బేనా‌ను చిత్తుగా ఓడించాడు. రెండు గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన జకో వరుసగా మూడు సెట్లను దక్కించుకున్నాడు. 5 ఏస్‌లు 43 విన్నర్లతో జకోవిచ్ విజృంభించాడు. ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. అలాగే, 2వ సీడ్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ), 4వ సీడ్ జ్వెరెవ్(జర్మనీ), 5వ సీడ్ మెద్వెదెవ్(రష్యా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. సిన్నర్ 6-4, 6-2, 6-4 తేడాతో గాస్కెట్(ఫ్రాన్స్)పై, జ్వెరెవ్ 7-6(7-4), 6-2, 6-2 తేడాతో డేవిడ్ గోఫిన్(బెల్జియం)పై విజయాలు నమోదు చేశారు. మెద్వెదెవ్ వాకోవర్ ద్వారా ముందడుగు వేశాడు. తొలి సెట్‌ను 6-1తో నెగ్గిన అతను.. రెండో సెట్‌లో 5-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి కెక్మనోవిక్ రిటైర్ అవడంతో మెద్వెదెవ్‌ను విజేతగా ప్రకటించారు.

సబలెంక జోరు

ఉమెన్స్ సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ అరీనా సబలెంక మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో ఆమె 6-2, 6-2 తేడాతో మోయుకా ఉచిజిమా(జపాన్)పై నెగ్గింది. 4వ సీడ్ రిబాకినా(కజకిస్తాన్) కూడా ముందడుగు వేసింది. రెండో రౌండ్‌లో రిబాకినా 6-3, 6-4 తేడాతో అరాంత్సా రస్(నెదర్లాండ్స్)ను మట్టికరిపించింది. అయితే, 9వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో(లాట్వియా),11వ సీడ్ డేనియల్ కాలిన్స్ రెండో రౌండ్‌కే పరిమితమయ్యారు. 


Similar News