డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌కు వేదికలు అవే.. రెండు చోట్ల నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్?

రెండో సీజన్‌ను రెండు వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తుందని తెలుస్తోంది.

Update: 2024-01-10 12:31 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ తరహాలో బీసీసీఐ గతేడాది నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) విజయవంతమైంది. అభిమానుల ఆదరణ పొందింది. ఈ ఏడాది రెండో సీజన్ జరగనుంది. ఇప్పటికే ప్లేయర్స్ ఆక్షన్ పూర్తి అయ్యింది. గతేడాది డిసెంబర్ 9న దుబాయ్ వేదికగా వేలం జరిగింది. ఇక, టోర్నీ మొదలవడమే మిగిలింది. క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా టోర్నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి చివర్లో లీగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్, వేదికలపై స్పష్టత రావాల్సి ఉంది. గతేడాది కేవలం ముంబై వేదికగానే మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే. అయితే, రెండో సీజన్‌ను రెండు వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తుందని తెలుస్తోంది. ఐపీఎల్ తరహాలో డబ్ల్యూపీఎల్‌ను విస్తరించాలని బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తద్వారా లీగ్‌ను అభిమానులకు మరింత దగ్గర చేసినట్టు అవుతుందని బోర్డు ఆలోచన. రెండో సీజన్‌ను ఢిల్లీ, బెంగళూరు వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అయితే, డబ్ల్యూపీఎల్ వేలం సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జైషా మాత్రం ఒకే వేదికగా టోర్నీ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. కానీ, ఇటీవల టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన విభిన్న నగరాల్లో డబ్ల్యూపీఎల్ నిర్వహించాలని నిర్వాహకులను కోరింది. ‘వేర్వేరు వేదికలపై డబ్ల్యూపీఎల్ నిర్వహించడం ద్వారా టోర్నీ మరో అడుగు వేసినట్టు అవుతుంది. నిర్వాహకులు ఆ దిశగా ఆలోచిస్తారని భావిస్తున్నా.’ అని తెలిపింది. మరి, డబ్ల్యూపీఎల్‌కు రెండు వేదికలు ఆతిథ్యమిచ్చే విషయంపై బీసీసీఐ స్పష్టతనివ్వాల్సి ఉంది. 

Tags:    

Similar News