టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ అతనే.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ సెక్రెటరీ జైషా
ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టును ఎవరు నడిపిస్తారన్న చర్చకు తెరపడింది.
దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టును ఎవరు నడిపిస్తారన్న చర్చకు తెరపడింది. రోహిత్ శర్మనే టీమ్ ఇండియాకు నాయకత్వం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా ధ్రువీకరించారు. రాజ్‌కోట్ స్టేడియంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన జై షా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘మనం వన్డే వరల్డ్ కప్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ, వరుసగా 10 మ్యాచ్‌లు నెగ్గి హృదయాలను గెలుచుకున్నాం. మనం ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుస్తాం. బార్బడోస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు విజేతగా నిలుస్తుంది.’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్నాయి.
కాగా, కొంతకాలంగా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే చర్చ జరుగుతుంది. రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉండటం, పొట్టి ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యాను జట్టు నడిపిస్తుండటంతో ఈ చర్చ మొదలైంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లోకి పునరాగమనం చేశాడు. దీంతో ప్రపంచకప్ కోసమే హిట్‌మ్యాన్ తిరిగి టీ20ల్లోకి వచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే, మెగా ఈవెంట్‌లో అతను కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా? లేదంటే ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగుతాడా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా బీసీసీఐ సెక్రెటరీ జై షా వ్యాఖ్యలతో టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాను రోహిత్ శర్మనే నడిపిస్తాడని తేలిపోయింది. బీసీసీఐ సెక్రెటరీ జై షా వ్యాఖ్యలతో టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాను రోహిత్ శర్మనే నడిపిస్తాడని తేలిపోయింది.