‘బాజ్ బాల్ కాదు.. డ్రావ్ బాల్’.. చరిత్ర సృష్టించిన టీమిండియా

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సోమవారం నాటి నాలుగో రోజు అల్ట్రా-ఎటాకింగ్..

Update: 2023-07-24 15:11 GMT

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సోమవారం నాటి నాలుగో రోజు అల్ట్రా-ఎటాకింగ్.. లాంగ్-ఫార్మాట్ క్రికెట్‌తో అరుదైన ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా టెస్ట్ రికార్డు పుస్తకాలను తిరగరాసింది. టెస్ట్ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో అత్యధిక రన్ రేట్ సాధించిన జట్టుగా నిలిచింది. అటాకింగ్ గేమ్ ప్లే, స్పష్టమైన ఫలితాలు సాధించాల్సిన అవసరాన్ని ‘బాజ్ బాల్’ అని ఇంగ్లండ్ క్రికెట్ ప్రేమికులు పిలుస్తున్నారు. భారత జట్టు అరుదైన ప్రతిభతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ‘డ్రావ్ బాల్’ను అభిమానులకు పరిచయం చేశారు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వైట్ బాల్ క్రికెట్ మోడ్‌లోని వెళ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడానికి ముందు 24 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 181 పరుగులు చేసి వన్డే మ్యాచ్‌ను తలపించింది. భారత్ 7.54 పరుగుల రన్ రేట్ సాధించింది. కనీసం 20 ఓవర్ల టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే. 2017లో సిడ్నీలో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా 32 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ రన్ రేట్ 7.53 పరుగులు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన రికార్డు కూడా భారత్ ఖాతాలో పడింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ 71 బంతుల్లోనే (11.5 ఓవర్లలో) 98 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్ అవుటైన తర్వాత భారత్ 100 పరుగుల మైలురాయిని 74 బంతుల్లోనే (12.2 ఓవర్లలో) చేరుకుంది. 2001లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 80 బంతుల్లో (13.2 ఓవర్లలో) 100 పరుగులు చేసింది. ఆ రికార్డును భారత్ 22 ఏళ్ల తర్వాత చెరిపేసింది.

టీ20 మ్యాచ్ మాదిరిగా చెలరేగిన రోహిత్ శర్మ 35 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడం విశేషం. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా ఇషాన్ నిలిచాడు. రిషబ్ పంత్ 28 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి ఇషాన్ 34 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి పరుగుల స్ట్రయిక్ రేట్ 152.94.

భారత్ రెండో ఇన్నింగ్స్:

యశస్వి జైస్వాల్ (సి) జోషువా దా సిల్వా (బి) జోమెల్ వారికన్ 38 (30 బంతులు, 4X4, 6X1)

రోహిత్ శర్మ (సి) అల్జర్ని జోసెఫ్ (బి) షన్నోన్ గాబ్రియెల్ 57 (44 బంతులు, 4X5, 6X3)

శుభ్‌మన్ గిల్ నాటౌట్ 29 (37 బంతులు, 4X1)

ఇషాన్ కిషన్ నాటౌట్ 52 (34 బంతులు, 4X4, 6X2)

అదనపు పరుగులు : 5

మొత్తం : 181/2 డిక్లేర్డ్ (24 ఓవర్లలో)

వికెట్ల పతనం : 98/1 (రోహిత్ శర్మ), 102/2 (యశస్వి జైస్వాల్)


Similar News