Sourav Ganguly: 'భారత్, పాకిస్తాన్ రెండూ మంచి జట్లే'.. గంగూలీ ఆసక్తికర కామెంట్స్

మరో ఐదు రోజుల్లో ఆసియా కప్ మొదలుకానుంది.

Update: 2023-08-24 13:11 GMT

కోల్‌కతా: మరో ఐదు రోజుల్లో ఆసియా కప్ మొదలుకానుంది. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ పోరు సెప్టెంబర్ 2న జరగనుంది. అయితే, దాయాదుల పోరు అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. అంతే స్థాయిలో ఉత్కంఠ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌‌పై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ పోరులో గెలుపెవరిది? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో తనకు ఫేవరెట్ జట్టు లేదని తెలిపాడు.

‘భారత్, పాకిస్తాన్ రెండూ మంచి జట్లే. ఏ జట్టు బాగా ఆడితే అదే గెలుస్తోంది. నాకంటూ ఫేవరెట్ లేదు.’ అని తెలిపాడు. అలాగే, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై దాదా స్పందిస్తూ.. బుమ్రా ఫిట్‌నెస్ మెరుగుపడుతుందని చెప్పాడు. ఆసియా కప్ కోసం అక్షర్ పటేల్ ఎంపిక సరైందని, అతను బంతితోనే కాకుండా బ్యాటుతో రాణించగలడని తెలిపాడు. కాగా, ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న పాక్‌తో మ్యాచ్‌తో టీమ్ ఇండియా టోర్నీని ఆరంభించనుంది.


Similar News