దులీప్ ట్రోఫీకి రోహిత్, కోహ్లీ, బుమ్రా దూరం

భారత దేశవాళీ పురుషుల క్రికెట్ సీజన్ 2024-25 దులీప్ ట్రోఫీతో ప్రారంభంకానుంది.

Update: 2024-08-14 14:03 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత దేశవాళీ పురుషుల క్రికెట్ సీజన్ 2024-25 దులీప్ ట్రోఫీతో ప్రారంభంకానుంది. ఈ టోర్నీ వచ్చే నెల 5 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో పాల్గొనే జట్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. దులీప్ ట్రోఫీకి భారత స్టార్ క్రికెటర్లు కూడా అందుబాటులో ఉండాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగంకానున్నారు. అయితే, కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, అశ్విన్‌లకు మినహాయింపు ఇచ్చారు. టీమ్ ‘ఏ’కు శుభ్‌మన్ గిల్, టీమ్ ‘బి’కి అభిమన్యు ఈశ్వరన్, టీమ్ ‘సి’కి రుతురాజ్ గైక్వాడ్, టీమ్ ‘డి’కి శ్రేయాస్ అయ్యర్‌లను కెప్టెన్లకు నియమించింది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, దూబె, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్ ఏ జట్టులో ఉండగా.. వికెట్ కీపర్ పంత్, యశస్వి జైశ్వాల్, జడేజా, సుందర్, సిరాజ్‌ను బి జట్టులో చేర్చారు. గైక్వాడ్ సారథ్యంలో సి జట్టులో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ ఆడనున్నాడు. ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ డి జట్టులో ఉన్నారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు టీమ్ ఇండియా.. బంగ్లాతో రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌కు ఎంపికైన క్రికెటర్ల స్థానాల్లో ఇతరులను భర్తీ చేస్తామని బోర్డు తెలిపింది. 

Tags:    

Similar News