భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, రవి దహియాలకు షాక్
భారత స్టార్ రెజర్లు, టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్ పూనియా, రవి దహియాలకు షాక్ తగిలింది.
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజర్లు, టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్ పూనియా, రవి దహియాలకు షాక్ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించడంలో ఈ స్టార్ రెజ్లర్లు విఫలమయ్యారు. దీంతో ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు వీరికి దాదాపుగా దారులు మూసుకపోయినట్టే. అంతర్జాతీయ టోర్నీల కోసం హర్యానాలోని సోనెపట్‌లో నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్, రవి దహియా ఓడిపోయారు. ఫ్రీస్టైల్ 57 కేజీల కేటగిరీలో నువ్వానేనా అన్నట్టు సాగిన బౌట్‌లో రవి దహియాపై 13-14 తేడాతో అమన్ సెహ్రావత్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాతి బౌట్‌లోనూ దహియా 8-10 తేడాతో ఉదిత్ చేతిలో పరాజయం పొందాడు. 65 కేజీల కేటగిరీ సెమీస్‌లో బజరంగ్ 1-9 తేడాతో రోహిత్ కుమార్ చేతిలో చిత్తుగా ఓడాడు.
దీంతో బజరంగ్, రవి దహియా పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. ఈ ట్రయల్స్‌లో గెలిచిన వారు ఏషియన్, వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొంటారు. ఇప్పటి వరకు రెజ్లింగ్‌కు భారత్‌కు ఒక్క ఒలింపిక్ బెర్త్ మాత్రమే దక్కింది. గతేడాది వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అంతిమ్ పంఘల్ మహిళల 53 కేజీల కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో రవి దహియా రజతం, బజరంగ్ పూనియా కాంస్యం గెలుచుకున్నారు.