Paris Olympics : సెమీస్ తర్వాత ఏం జరిగింది?.. వినేశ్ బరువు ఎలా పెరిగింది?

పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.

Update: 2024-08-07 12:56 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. 50 కేజీల కేటగిరీలో ఆమె పోటీపడింది. బుధవారం ఉదయం బరువు కొలిచే సమయంలో నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో వినేశ్‌ను పోటీ నుంచి తప్పించారు. అయితే, సెమీస్‌లో పాల్గొన్న వినేశ్ 12 గంటల్లో బరువు ఎలా పెరిగిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

50 కేజీల కేటగిరీ‌ మ్యాచ్‌లు రెండు రోజులపాటు జరుగుతాయి. మంగళవారం తొలి రౌండ్, క్వార్టర్స్, సెమీస్ బౌట్లు జరగగా.. బుధవారం ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ రెండు రోజులపాటు రెజ్లర్లు తమ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. తొలి రోజు వినేశ్ బరువు నియంత్రణలో ఉన్నది. 49.9 కేజీల బరువు ఉంది. ఇది ఆమె సాధారణ బరువు కంటే చాలా తక్కువ అని తెలుస్తోంది. దీనివల్ల ఆమె కొంచెం ఆహారం, నీళ్లు తీసుకున్నా బరువు పెరుగుతుందని సమాచారం.

అయితే, ఒకే రోజు వినేశ్ మూడు బౌట్లలో పోటీపడుతుండటంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లు తీసుకున్నట్టు ఐవోఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. సెమీస్ తర్వాత ఆమె 52.7 బరువు పెరిగింది. ఫైనల్ నాటికి ఆమె బరువు తగ్గేందుకు కష్టపడింది. ఆహారం, నీళ్లు తీసుకోలేదు. నిద్ర కూడా పోలేదు. వ్యాయామం, ఆవిరి స్నానం చేసింది. ఉదయం నాటికి ఆమె బరువు 50.1కేజీలు తగ్గింది. అధిక బరువును తగ్గించడానికి సమయం లేకపోవడంతో ఆమెపై వేటు పడింది. 

Tags:    

Similar News