తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి షాక్.. వెస్టిండీస్‌తో సిరీస్‌కు పక్కనపెట్టిన సెలెక్టర్లు

ఈ నెలలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత మహిళల క్రికెట్ జట్లు ఖరారయ్యాయి.

Update: 2024-12-13 16:27 GMT

దిశ, స్పోర్ట్స్ :ఈ నెలలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత మహిళల క్రికెట్ జట్లు ఖరారయ్యాయి. శుక్రవారం బీసీసీఐ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి, బౌలర్ అరుంధతి రెడ్డిని పక్కనపెట్టడం గమనార్హం. ఇటీవల ఆసిస్ టూరులో ఆఖరి వన్డే ఆమె 4 వికెట్లు తీసింది. ఆమెను జట్టు నుంచి తప్పించడానికి కారణం వెల్లడించలేదు. ఢిల్లీకి చెందిన బ్యాటర్ ప్రతీక రావల్ తొలిసారిగా పిలుపు అందుకుంది. వన్డే జట్టులో ఆమెకు చోటు దక్కింది. అలాగే,నందిని కశ్యప్, రఘ్వి బెస్ట్ తొలిసారిగా టీ20 జట్టుకు ఎంపికయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, రిచా ఘోష్, రోడ్రిగ్స్, రేణుక, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, దీప్తి శర్మ, ప్రియా మిశ్రా వన్డే, టీ20 జట్లలో చోటు సంపాదించారు. శ్రేయాంక పాటిల్,ప్రియా పూనియా, యాస్తికా భాటియా గాయాల కారణంగా సెలెక్షన్‌కు అందుబాటులో లేరు. పూజ వస్త్రాకర్, షెఫాలీ వర్మను పక్కనపెట్టారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 15న తొలి మ్యాచ్ జరగనుంది. 17, 19 తేదీల్లో మిగతా రెండు టీ20లు జరగనున్నాయి. ఈ నెల 22, 24, 27 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది.

Tags:    

Similar News