టీమ్ ఇండియాలోకి నితీశ్ రెడ్డి.. కైఫ్ అప్పుడే చెప్పాడు

నితీశ్ తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు.

Update: 2024-06-24 16:14 GMT

దిశ, స్పోర్ట్స్ : మహ్మద్ సిరాజ్.. భారత జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. తిలక్ వర్మ..ఇప్పుడిప్పుడే తనదైన ముద్ర వేస్తున్నాడు. మరో తెలుగు కుర్రాడు జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ కుర్రాడు మరేవెరో కాదు నితీశ్ కుమార్ రెడ్డి. నితీశ్ తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. నితీశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతని ఆటే అందరికి అతన్ని పరిచయం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన నితీశ్ దేశవాళీలో ఆంధ్ర జట్టుకు ఆడుతున్నాడు. పేస్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 566 పరుగులు, 52 వికెట్లు పడగొట్టాడు. 22 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 403 రన్స్, 14 వికెట్లు తీశాడు. అయితే, అతను వెలుగులోకి వచ్చింది మాత్రం ఈ ఏడాది ఐపీఎల్‌లోనే. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున నితీశ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే, ఆ సీజన్‌లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సీజన్‌లో మాత్రం నితీశ్ అదరగొట్టాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 303 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ‘అతని పేరు వింటారు.. భవిష్యత్తులో చాలా సార్లు అతని పేరు వింటారు.’ అని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ నితీశ్ గురించి చెప్పాడంటే ఐపీఎల్‌లో అతను తన ఆట తీరుతో ఎలాంటి ముద్ర వేశాడో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌లో అతను ఫియర్‌లెస్ ఆట ఆడాడు. పంజాబ్, రాజస్థాన్‌పై అతను బాదిన హాఫ్ సెంచరీలే అతని దూకుడు ఆటతీరును చెబుతాయి. పలు మ్యాచ్‌ల్లో కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి తోడ్పడ్డాడు. పేస్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ ఈ సీజన్‌లో మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. భారత జట్టు ఎప్పటి నుంచి మంచి పేస్ ఆల్‌రౌండర్ కోసం చూస్తోంది. ఆ స్థానానికి నితీశ్ చక్కగా సరిపోతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.


Similar News