బాక్సింగ్ రింగులో సివంగిలా రెచ్చిపోతున్న నిఖత్..

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది.

Update: 2023-03-26 16:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. 50 కేజీల కేటగిరీ ఫైనల్ బౌట్‌లో నిఖత్ 5-0 తేడాతో వియత్నం బాక్సర్ న్గుయెన్ తీ టామ్‌ను చిత్తు చేసింది. బౌట్ ప్రారంభం నుంచి నిఖత్ వేగంగా కదులుతూ దూకుడు ప్రదర్శించింది. వియత్నం బాక్సర్‌కు దూరంగా ఉంటూ వ్యూహాలు రచించిన నిఖత్.. కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించిన ఆమె.. ఎడమ చేతి పంచ్‌లు హైలెట్‌గా నిలిచాయి.

చివరి వరకు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నిఖత్.. ఐదుగురు జడ్జీల మద్దతును పొందింది. దాంతో నిఖత్ ఏకపక్ష విజయం సాధించినట్టు రిఫరీ ప్రకటించాడు. దాంతో వరల్డ్ చాంపియన్‌లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచింది. మేరీకోమ్ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు స్వర్ణం గెలిచిన రెండో భారత మహిళా బాక్సర్‌గా నిఖత్ రికార్డు సృష్టించింది. మేరీ కోమ్ ఆరు సార్లు విజేతగా నిలిచింది.

కేటగిరీ మార్చుకుని..

గతేడాది ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ 52 కేజీల కేటగిరీలో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. 2018లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ స్వర్ణం గెలిచిన తర్వాత.. భారత్‌ నుంచి వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది నిఖత్ మాత్రమే. వరల్డ్ చాంపియన్‌షిప్‌ నెగ్గిన అనంతరం తన లక్ష్యం పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే అని నిఖత్ చాలా సందర్భాల్లో చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌పై ఫోకస్ పెట్టిన నిఖత్.. 50 కేజీల కేటగిరీలో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది.

ఒక కేటగిరీలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచి మరో కేటగిరీకి మారడం అంత సులభం కాదు. దానికి డైట్, సాధన చాలా అవసరం. ఆ దిశగా శిక్షణ ప్రారంభించిన నిఖత్ రెండు కిలోలు తగ్గింది. గతేడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో నిఖత్ 50 కేజీల కేటగిరీలో పోటీపడి స్వర్ణం గెలిచింది. అదే జోరును నిఖత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ ప్రదర్శించింది.

ఫ్యూచర్ స్టార్ నిఖత్

బాక్సింగ్ అనగానే గుర్తొచ్చే పేరు మేరీకోమ్. అయితే, మేరీకోమ్ తర్వాత ఎవరంటే స్పష్టంగా చెప్పలేం. కానీ, వరల్డ్ చాంపియన్‌షిప్‌ను రెండుసార్లు నెగ్గిన నిఖత్ జరీన్ ఫ్యూచర్ స్టార్‌గా కనిపిస్తున్నది. 2018 నుంచి నిఖత్ బాక్సింగ్‌లో నిలకడగా రాణిస్తున్నది. ఆ ఏడాది బెల్గ్రేడ్ అంతర్జాతీయ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన నిఖత్.. 2019లో థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రజతం సాధించింది. అదే ఏడాదిలో స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌ విజేతగా నిలిచిన ఆమె.. గతేడాది అదే టోర్నీలో మరోసారి స్వర్ణం సాధించింది.

ఆ తర్వాత ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ అడుగుపెట్టింది. అరంగేట్రంలోనే వరల్డ్ చాంపియన్‌‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో తన కేటగిరీని మార్చుకుని మరి 50 కేజీల కేటగిరీలో బరిలోకి దిగింది. అంచనాలను అందుకుంటూ స్వర్ణం ముద్దాడింది. ఇప్పుడు మరోసారి వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. బ్యాక్ టూ బ్యాక్ విజేతగా నిలవడం బాక్సింగ్‌లో చాలా అరుదు. దానికి కఠోర దీక్ష, పట్టుదల, సాధన ఉంటే తప్ప సాధ్యం కాదు. కొంతకాలంగా నిలకడ ప్రదర్శనతో రాణిస్తున్న నిఖత్‌ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

క్రీడా కుటుంబం నుంచి..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ కు చెందిన ఎండీ జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానాకు నలుగురు కూతుళ్లు కాగా అందులో మూడో సంతానం నిఖత్ జరీన్. 1996 జున్ 14న జన్మించిన ఆమె జన్మించింది. స్వతహాగా ఫుట్ బాల్ క్రీడాకారుడు అయిన జమీల్ అహ్మద్ పదేళ్ల పాటు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో పని చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చిన జమీల్ అహ్మద్ నిజామాబాద్ కు చెందిన కోచ్ శంషొద్దిన్ సూచనతో నిఖత్ ను బాక్సింగ్ బరిలో దించాడు. జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ పాఠశాలలో పాఠశాల విద్య చదివిన నిఖత్ ఇంటర్, డిగ్రీ హైదారాబాద్ లో పూర్తి చేశారు.

అబ్బాయిలతో బాక్సింగ్ ప్రాక్టీస్..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ (డీఎస్ఏ )లోనే కోచ్ శంషుద్దీన్ వద్ద నిఖత్ బాక్సింగ్ లో ఓనమాలు దిద్దారు. నిఖత్ బాక్సింగ్ ప్రాక్టీస్ సమయంలో అందరు అబ్బాయిలే శిక్షణ పొందేవారు. దానితో అబ్బాయిలతో ప్రాక్టీసింగ్​తో పాటు సంప్రదాయా పరిమితులపై భవిష్యత్తులో ఇబ్బందులు అంటూ నిరాశపర్చేవారు. కానీ కోచ్ సహకారం, తండ్రి ప్రోత్సాహంతో తోటి అబ్బాయిలతోనే నిఖత్ జరీన్ బాక్సింగ్ రింగ్ లో రాటు దేలారు.

బాక్సింగ్​ రింగ్​లో సివంగి

2009లో కరీంనగర్ లో జరిగిన రాష్ర్ట స్థాయి పైకా టోర్నీలో బంగారు పతకం

2010 జనవరిలో విశాఖలో అండర్ 16 విభాగంలో 48 కేజీల కేటగిరిలో బంగారు పతకం

2010 డిసెంబర్ లో విశాఖలో జరిగిన మరో పోటీలోను బంగారు పతకం

2010లో పంజాబ్ లో జరిగిన పైకా క్రీడల్లో బాక్సింగ్ లో కాంస్య పతకం.. అదే ఏడాది

తమిళనాడు ఈ రోడ్ లో జరిగిన అండర్ 16 పోటీల్లో బంగారు పతకంతో పాటు బెస్ట్ బాక్సర్ అవార్డు. అదే ఏడాది భారతజట్టులో చోటు..

2011 లో పంజాబ్​లో జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలో వెండి పతకం.

2011 లో టర్కీలో జరిగిన యూత్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం.. ప్రపంచ రికార్డు. అదే ఏడాది బల్గేరియాలో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో రజతం.

2015-16 లో సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం.

2019 లో బ్యాంకాక్ లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో వెండి పతకం.

2022 మేలో టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన మహిళ బాక్సింగ్ పోటీల్లో ప్రపంచ చాంపియన్ గా అవతరణ.

జిల్లాకు తొలి అర్జున అవార్డు

మహిళల బాక్సింగ్ చాంపియన్​గా నిలిచిన నిఖత్ జరీన్ కు భారత ప్రభుత్వం గత ఏడాది అర్జున అవార్డును బహుకరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో నిఖత్ ఒక్కరికే ఈ అవార్డు దక్కడం గమనార్హం. ప్రపంచ చాంపియన్ గా నిలిచిన నిఖత్ కు రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీ హిల్స్ లో 600 గజాల స్థలాన్ని కేటాయించి... పోలీస్ అసిస్టెంట్​ కమిషనర్​గా ఉద్యోగం కల్పించారు. దీనితోపాటు రూ.కోటి నజరానా తో సత్కరించింది.

ఆ తర్వాత ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ అడుగుపెట్టింది. అరంగేట్రంలోనే వరల్డ్ చాంపియన్‌‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో తన కేటగిరీని మార్చుకుని మరి 50 కేజీల కేటగిరీలో బరిలోకి దిగింది. అంచనాలను అందుకుంటూ స్వర్ణం ముద్దాడింది.

ఇప్పుడు మరోసారి వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. బ్యాక్ టూ బ్యాక్ విజేతగా నిలవడం బాక్సింగ్‌లో చాలా అరుదు. దానికి కఠోర దీక్ష, పట్టుదల, సాధన ఉంటే తప్ప సాధ్యం కాదు. కొంతకాలంగా నిలకడ ప్రదర్శనతో రాణిస్తున్న నిఖత్‌ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News