పాక్‌కు షాక్.. తొలి టీ20 కివీస్‌దే

ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర టెస్టు సిరీస్ ఓటమిని చవిచూసిన పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ టూరులో ఆరంభంలోనే షాక్ తగిలింది.

Update: 2024-01-12 13:14 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర టెస్టు సిరీస్ ఓటమిని చవిచూసిన పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ టూరులో ఆరంభంలోనే షాక్ తగిలింది. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. అక్లాండ్‌లో జరిగిన తొలి టీ20లో 46 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన ఆతిథ్య కివీస్ సిరీస్‌లో శుభారంభం చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లో 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. అతనికితోడు కెప్టెన్ విలియమ్సన్(57) హాఫ్ సెంచరీతో రాణించడంతోపాటు ఫిన్ అలెన్(34), చాప్‌మెన్(26) మెరిశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది మూడేసి వికెట్లు తీయగా.. హారిస్ రవూఫ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనకు దిగిన పాక్ ఇన్నింగ్స్‌ను కివీస్ బౌలర్లు 18 ఓవర్లలోనే ముగించారు. టిమ్ సౌథీ 4 వికెట్లతో చెలరేగడంతోపాటు ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ రెండేసి వికెట్లతో సత్తాచాటడంతో పాక్ పతనమైంది. బాబర్ ఆజామ్(57) ఒక్కడే పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే అవుటవడంతో పాక్ ఓటమి తప్పలేదు. 18 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 సిరీస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం రెండో టీ20 జరగనుంది.

Tags:    

Similar News