‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ రేసులో నీరజ్
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2023’కు నామినేట్ అయ్యాడు.
న్యూఢిల్లీ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2023’కు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డుకు పోటీపడుతున్న 11 మంది అథ్లెట్ల పేర్లను గురువారం వరల్డ్ అథెటిక్స్ ప్రకటించింది. ఈ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, డైమండ్ లీగ్‌లో రజతం గెలుచుకున్న అతను.. ఇటీవల ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. అలాగే, జావెలిన్ త్రోలో వరల్డ్ నం.1గా నిలిచిన సంగతి తెలిసిందే. నామినేట్ అయిన వారిలో నీరజ్‌తోపాటు ర్యాన్ క్రౌజర్(అమెరికా, షాట్‌పుట్), మోండో డుప్లాంటిస్(స్వీడన్, పోల్ వాల్ట్), సౌఫియాన్ ఎల్ బక్కాలి(మొరాకో, 3,000 స్టీపుల్‌చేజ్), జాకబ్ ఇంగెబ్రిగ్ట్సెన్(నార్వే, 1500 మీటర్లు/5000మీటర్లు), కెల్విన్ కిప్తుమ్(కెన్యా, మారథాన్), పియర్స్ లెపేజ్(కెనడా, డెకథ్లాన్), నోహ్ లైల్స్(అమెరికా, 100 మీటర్లు/200మీటర్లు), అల్వారో మార్టిన్(స్పెయిన్, రేస్ వాక్), మిల్టియాడిస్ టెన్టోగ్లో(గ్రీస్, లాంగ్‌జంప్), కార్స్టన్ వార్హోమ్(నార్వే, 400మీటర్ల హర్డిల్స్/400మీటర్లు) ఉన్నారు.
డిసెంబర్ 11న విజేతగా ప్రకటించనున్నట్టు వరల్డ్ అథ్లెటిక్స్ తెలిపింది. వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్, వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్యామిలీ, అభిమానుల ఓట్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సోషల్ మీడియాలో పోస్టు చేసే నామినీ పోస్టులకు లైక్, రీట్వీట్ చేయడం ద్వారా అభిమానులు ఓటు వేయవచ్చు. అక్టోబర్ 28 వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.