ఆమె నాకూ అమ్మే.. నీరజ్ తల్లిపై పాక్ అథ్లెట్ నదీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తల్లి తనకూ అమ్మేనని పాక్ అథ్లెట్, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తల్లి తనకూ అమ్మేనని పాక్ అథ్లెట్, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ తెలిపాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో నదీమ్ స్వర్ణం గెలుచుకోగా.. నీరజ్ రజతం సాధించాడు. అప్పుడు నీరజ్ తల్లి సరోజ్ దేవి స్పందిస్తూ.. ‘నదీమ్ కూడా మా బిడ్డే’ అని వ్యాఖ్యానించింది. ఆదివారం నదీమ్ స్వదేశానికి చేరుకోగా అతనికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నదీమ్ మీడియాతో మాట్లాడుతూ.. సరోజ్ దేవి చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ‘ఒక తల్లి అందరికీ తల్లే. అందుకే, అందరి కోసం ప్రార్థించింది. నీరజ్ చోప్రా తల్లికి నేను కృతజ్ఞుడిని. ఆమె నాకు కూడా అమ్మే. ప్రపంచ వేదికపై దక్షిణ ఆసియా నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసింది నేను, నీరజ్ మాత్రమే.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఒలింపిక్స్‌లో పాక్‌కు వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా నదీమ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.