Neeraj Chopra Diamond League: డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌కు రెండో స్థానం..

స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ వేదికగా ఉత్కంఠగా జరిగిన డైమండ్‌ లీగ్‌ టోర్నీలో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు.

Update: 2023-09-01 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ వేదికగా ఉత్కంఠగా జరిగిన డైమండ్‌ లీగ్‌ టోర్నీలో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో స్వర్ణం సాధిస్తాడని అందరూ భావించినప్పటికీ.. రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవలే జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలిచిన భారత స్టార్‌ జావెలిన్ త్రో ప్లేయర్​నీరజ్‌ చోప్రా.. తాజాగా జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 80.70 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. ఆ తర్వాత రెండు, మూడు ప్రయత్నాల్లో ఫౌల్‌ అయ్యాడు. ఇక నాలుగు ప్రయత్నంలో 85.22 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో స్థానంలోకి వచ్చాడు. అయితే ఐదో ప్రయత్నంలో మరోసారి ఫౌల్‌ అయ్యాడు. చివరి ప్రయత్నంలో 85.71 మీటర్లు విసిరాడు. మరోవైపు ఈ డైమండ్​లీగ్‌లో తొలి స్థానంలో జాకబ్‌ వాడ్లెజ్‌ (85.86) నిలిచాడు. ఈ సీజన్ డైమండ్‌ లీగ్‌ల్లో భాగంగా మే 5న దోహాలో, జూన్‌ 30న లౌసానేలో నీరజ్‌ అగ్రస్థానం సాధించిన సంగతి తెలిసిందే. డైమండ్‌ లీగ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన చోప్రా.. తన ఖాతాలో ప్రస్తుతం 23 పాయింట్లును కలిగి ఉన్నాడు. యూజిన్‌లో సెప్టెంబర్‌లో డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌ జరగనుంది.


Similar News